డ్రగ్ మాఫియాకు కేంద్రంగా గ్రేటర్ హైదరాబాద్?

drugs
ఠాగూర్| Last Updated: గురువారం, 3 డిశెంబరు 2020 (06:51 IST)
హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియా ఓ భాగమైపోయింది. ఇటీవలి కాలంలో డ్రగ్స్ ముఠాకు చెందిన అనేక మందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పైగా, ఈ మాఫియాకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో సైతం లింకులు ఉన్నట్టు ఆరోపణలు లేకపోలేదు. గతంలో కూడా మాదకద్రవ్యాల కేసులో పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ.. డ్రగ్ మాఫియా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాగా వేసింది.

ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్‌లు భారీ మొత్తంలో మత్తు పదార్థాలను నగరానికి స్మగ్లింగ్ చేస్తున్నారు. అంతర్రాష్ట్రాల నుంచి గంజాయి కుప్పలు కుప్పలుగా రాజధానికొస్తుంది. పోలీసులు డేగ కన్ను వేసి తనిఖీలు చేసినా ఎక్కడో ఒక చోటు నుంచి గంజాయి సంచులు దిగుమతి అవుతూనే ఉన్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి.

దీనికితోడు ఒక వర్గం వారిని, పబ్‌లను టార్గెట్ చేసుకున్న ముఠాలు డ్రగ్స్‌ను అలవాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. వీటికి నిదర్శనం.. తార్నాకలో బుధవారం పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. నిందితుల నుంచి నిషేధిత ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 236 గ్రాముల హాషీష్ ఆయిల్‌ను సీజ్ చేశారు.

ఇటువంటి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ పట్టుబడింది. గోవా, బెంగళూరు కేంద్రంగా ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కు చేరుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు డ్రగ్ స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. నగరానికి డ్రగ్స్ ఎలా వస్తున్నాయో అంతుచిక్కకుండా మారింది.

నగరంలో ధూల్‌పేట కేంద్రంగా పెద్ద మొత్తంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. దందా సాఫీగా సాగేందుకు వాటికి బానిసలు అయిన వారినే ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఈ ఏజెంట్లతోనే ఇతరులకు కూడా సరఫరా చేస్తున్నారు. అపరిచితులకు గంజాయి విక్రయాలు నిషేధం. ఈ విషయంలో గంజాయి వ్యాపారులు జాగ్రత్త పడడంతో విషయం బయటకు రావట్లేదని తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :