బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:59 IST)

మీ శరీరంలో రోగనిరోధక శక్తి ఉందా? కోవిడ్‌-19పై పోరాటంలో విజయం మీదే

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు మనం చేయాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే. మాస్క్ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో.. మన శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం కూడా అంతేముఖ్యం.

మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటే ఒక వేళ కోవిడ్ సోకినా రోగనిరోధక శక్తి కారణంగా త్వర‌గా కోలుకునే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్పడ‌కుండా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కూడా ఇదివరకే అనేక సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ ఆయుష్ మంత్రిత్వశాఖ ఇచ్చిన సూచనలను పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
 
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు:
* దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగండి
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి
* రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి 
* ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి
 
ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు: 
* ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చవనప్రాశ్ తినాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ్ తీసుకోవాలి.
* తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి. అలాగే మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు.
* 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేక రెండుసార్లు తాగండి.
 
సులభమైన ఆయుర్వేద పద్ధతులు:
* నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. ఇలా ఉదయం మరియు సాయంత్రం చేయండి.
* ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకుని నోటిలో వేసుకుని రెండు మూడు నిమిషాలపాటు పుక్కిలించి తర్వాత ఊసేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు.
* పొడిదగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి.
* లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఒకవేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
 
క్యారెట్లు, ఆకుకూర‌లు:
క్యారెట్లు, ఆకుకూర‌ల్లో విట‌మిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాలు, సూక్ష్మక్రిములు తొల‌గిపోతాయి. క్యారెట్లతోపాటు ఆకుకూర‌లు, చిల‌గ‌డ‌దుంప‌,  కీరాదోస‌, మామిడి పండ్లు, క‌ర్బూజా పండ్లలో, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్-ఎ గా మారి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
 
ఉసిరితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు:
ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీగా పిలుచుకునే ఉసిరి మ‌న శ‌రీరానికి ఎన్నో ప్రయోజ‌నాలు కలిగిస్తుంది. శ‌తాబ్దాలుగా వివిధ ఆరోగ్య పద్దతుల్లో వ్యాధుల చికిత్స కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఉసిరిలో నారింజ‌లో క‌న్నా వీటిలో 20 రెట్లు ఎక్కువ‌ విట‌మిన్ సీ ఉంటుంది. విటమిన్ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, చర్మానికి మేలు చేస్తుంది. ఇది కాకుండా, జీవక్రియ, ఎముకల నిర్మాణం, పునరుత్పత్తి, రోగనిరోధక ప్రతిస్పందనను పెంచడానికి ఉసిరి సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్ లేదా రోజూ ఉదయం ఒక పండు తినండం ద్వారా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిచుకోవ‌చ్చు.
 
నారింజ‌తో ఆరోగ్యం:
నారింజ కూడా ఎన్నో విధాలుగా మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే సిట్రస్ జాతి పండు. వీటిని వివిధ రకాలుగా ఆహారాల్లో చేర్చుకోవచ్చు. మీడియం సైజ్ ఆరెంజ్ లో 53.2 మి.గ్రా విటమిన్ సీ ఉంటుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచడానికి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాల‌ను రక్షించడానికి సహాయపడతాయి. జలుబు, ఇతర అలెర్జీలతో బాధపడుతున్న వారికి నారింజ ఎంతో మంచిది. ఈ పండు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది.
 
ద్రాక్ష:
మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క క‌ణాల‌ను, తెల్ల ర‌క్త క‌ణాల‌ను వృద్ధి చేసేందుకు విట‌మిన్-సి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ద్రాక్ష, బ‌త్తాయి పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బెంగ‌ళూరు క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, ఉడ‌క‌బెట్టిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌ల‌లో మ‌న‌కు విట‌మిన్-సి అధికంగా ల‌భిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.
 
కోడిగుడ్లు, పాలు:
బాక్టీరియా, వైర‌స్‌లు ర‌క్తంలో ఇన్ఫెక్షన్లను క‌లిగిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే విట‌మిన్-డి త‌గినంత‌గా ఉంటే ఆ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకు విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇది మ‌న‌కు సూర్యర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. అలాగే చేప‌లు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, ప‌నీర్‌, పుట్టగొడుగులలోనూ విట‌మిన్-డి ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క వ్యవ‌స్థ ప‌టిష్టమ‌వుతుంది.
 
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయా:
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్‌, మాంసం, శ‌న‌గ‌లు, చిక్కుడు జాతి గింజ‌లు, చిరు ధాన్యాలు, గింజ‌లు, చీజ్, ప‌నీర్‌, పెరుగుల‌లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు జింక్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పైన సూచించిబడిన వాటిని తీసుకుంటూ మనలో రోగనిరోధక శక్తిని పెంచుకుందాం. కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొందాం.
- డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19