కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ ఉత్సాహపూరితమైన పోరాటం : మోడీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ ఉత్సాహపూరితమైన పోరాటం చేసిందని 'మన్‌కీ బాత్' లో ప్రధాని మోడీ అన్నారు. జనతా కర్ఫ్యూలో ప్రజలు చూపిన క్రమశిక్షణను ప్రపంచమంతా గుర్తించిందని పేర్కొన్నారు. మన్‌కీబాత్ కార్యక్రమం 75 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
చప్పట్లు కొట్లడం, పాత్రలను మోగించడం, దీపాలు వెలిగించడం వంటి చర్యలు కరోనా యోధుల హృదయాలను తాకాయని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంటుందా, ఎప్పుడు తయారవుతుంది అన్న ప్రశ్నలకు సమాధానంగా.. ప్రస్తుతం భారత్ అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతోందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ మహిళలు క్రీడలతో పాటు ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూలను గుర్తు చేసుకున్నారు.
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో భారత క్రికెటర్ మిథాలీరాజ్ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బ్యాడ్మింటన్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధూను కూడా అభినందించారు. మార్చి నెలలోనే మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నామని, ఇదే నెలలో దేశ మహిళలు క్రీడల్లో పతకాలు, రికార్డులు సాధించారని అన్నారు.
అలాగే తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన బస్ కండక్టర్ యోగనాథన్ ను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఆయన కండక్టర్‌గా పనిచేస్తూనే చెట్లు నాటడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఒడిశాలోని కేంద్రపాడ్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి 12 ఏళ్లు శ్రమించి సముద్రం ఒడ్డున 25 ఎకరాల్లో మడ అడవిని నిర్మించారని ప్రశంసించారు.
బెనారస్‌కు చెందిన ఇంద్రపాల్ పిచ్చుకలకు ఆవాసంగా తన నివాసాన్ని మార్చారని, ఆయన ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇటీవలే పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకున్నామని, పిచ్చుకలను రక్షిచేందుకు అందరూ కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. అసోంలోని కార్బీ జిల్లాకు చెందిన సికారి టిస్సో అనే వ్యక్తి 20 ఏళ్లుగా కర్బీ భాషను డాక్యుమెంట్ చేస్తున్నారని అన్నారు.