మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 22 మే 2017 (17:31 IST)

ఇది చదివితే... ఇంకెవ్వరూ అలా చేయరు...

మానవ శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తే తప్ప మనిషి ముందుకు కదలలేడు. అయితే చివరి క్షణంలో మనిషి మరణించే సమయంలో ఆ అవయవాలను దానం చేయడానికి ఇష్టపడరు. ఆ అవయవాలను వేరొకరికి ఇస్తే ఇతరులకు ఎంత ఉపయోగపడుతాయో తెలియజెప్ప

మానవ శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తే తప్ప మనిషి ముందుకు కదలలేడు. అయితే చివరి క్షణంలో మనిషి మరణించే సమయంలో ఆ అవయవాలను దానం చేయడానికి ఇష్టపడరు. ఆ అవయవాలను వేరొకరికి ఇస్తే ఇతరులకు ఎంత ఉపయోగపడుతాయో తెలియజెప్పే ప్రయత్నమిది. 
 
బ్రెజిల్‌లో ఒక కోటీశ్వరుడు తన ఒక మిలియన్ డాలర్ ఖరీదు గల బెంట్లీ కారుని ఫలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు. నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే.. నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఈ కోటీశ్వరుడిని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, ఒక మిలియన్ డాలర్ కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు.
 
మీడియాతో పాటుగా ప్రజలు కూడా బాగా తిట్టారు అతడిని. అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందోనని చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు. పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు. అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా.. ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు. మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగానూ పనికిరాదు. దీనిని వేరెవరికైనా ఇవ్వవచ్చు కదా.. అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు.
 
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను. దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికి నా మీద ఇంత కోపం వచ్చింది.  
 
నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని... మీ(మన) గుండె... కళ్ళు... ఊపిరితిత్తులు.. మూత్రపిండాలు.. ఇలా మన శరీరంలోని అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా. వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని ఆలోచన కాని లేదు ఎందుకు? కారు పోయినా.. డబ్బు పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది. మరి మన అవయవాలు తిరిగి వస్తాయా. వాటికి విలువ కట్టగలమా. మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేకపోతున్నాం. 
 
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నారు కదా. మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు. ఆలోచించండి.. అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి. మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారికి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్దమనిషి.