నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఐతే అనారోగ్యం తెచ్చుకున్నట్లే.. ఏం చేయాలి?
సాధారణంగా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతను వింటూనే ఉంటాం. ఇది సామెత వరకు అయితే సరి, కానీ నీళ్లు నిలబడి తాగితే మాత్రం చాలా డేంజర్ అంటూ నిపుణులు అంటున్నారు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యకరం.