శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:21 IST)

గవదబిళ్ళలు కారణం ఏమిటి?

గవదబిళ్ళలు పెరోటిడ్ గ్రంధి వాచిపోవడం వల్ల వస్తాయి. ఈ వ్యాధికి కారణం వైరస్. పెరోటిడ్ గ్రంధులు చెవులకు క్రింద మరియు మందు భాగంలో వుండి లాలాజలాన్ని (ఉమ్మి)ని స్రవిస్తాయి. లాలాజలం జీర్ణ ప్రక్రియకు దోహదపడుతుంది. ఈ వ్యాధి అంటువ్యాధి. ఇది ఉమ్మి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 2 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలకు సోకుతుంటుంది. 
 
పెద్దవారికి ఇది సోకితే, వైరస్ గవదబిళ్ళలకే కాక మగవారిలో బీజాశయాలకు, ప్లీహము మరియు నాడీ మండలానికి కూడా వ్యాపిస్తుంది. ఇది సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడటానికి 12 నుండి 14 రోజులు పడుతుంది. లాలాజల గ్రంధులు నొప్పితో కూడుకుని వాచిపోతాయి. ముందుగా ఒక గ్రంధి ప్రభావితమై మూడు నుండి ఐదు రోజుల లోపల రెండు గ్రంధులు వాస్తాయి. 
 
నమిలేటప్పుడు, మింగేటప్పుడు చాలా నొప్పి కలుగుతుంది. పుల్లటి ఆహార పదార్థాలు, ద్రవాలు సేవించినప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం వస్తుంది, తలనొప్పి, ఆకలిలేమి వంటి లక్షణాలు ఉంటూ 3 నుంచి 4 రోజులలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. 7 నుండి 10 రోజుల లోపు గవదబిళ్ళలు (వాపు) కూడా తగ్గిపోతుంది. ఇది సోకిన పిల్లలను ఆ సమయంలో దూరంగా ఉంచాలి. 
 
పాఠశాలకు, ఆటలకు పంపకూడదు. పెద్దవారిలో అయితే బీజాశయాలు వాచి నొప్పిపుడుతాయి. గవదబిళ్ళల సంక్రమణం మెదడువాపు, నొప్పికి కూడా దారితీయవచ్చు. యుక్త వయసు మగవారిలో బీజాశయాలకు సోకినప్పుడు వంధత్వము సంభవించును. కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం, వాంతులు, బీజాశయాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
 
దీనికి ప్రత్యేకమైన చికిత్స లేదు. పారాసిటమల్ వలన జ్వరం, నొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఆస్ప్రిన్ ఇవ్వకూడదు. ఒకసారి గవదబిళ్ళలు వచ్చిన వారికి మళ్ళీ రావు. ఇది జీవితకాలం వ్యాధి నిరోధక శక్తినిస్తుంది. చిన్న పిల్లలలో ఎవరికైతే గవదబిళ్ళలు రాలేదో వారికోసం టీకాలు ఉన్నాయి. యమ్. యమ్. ఆర్. మూడు అంటువ్యాధులకు నిరోధక శక్తినిస్తుంది. అవి గవదబిళ్ళలు, తట్టు (పొంగు) మరియు రూబెల్లా.