శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (16:11 IST)

గుమ్మడి గింజలతో చర్మ సౌందర్యం... వెంట్రుకలు సిల్కులా మెరుస్తాయి...

గుమ్మడి కాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుమ్మడి కాయతోనే కాదు.. గుమ్మడి గింజలతో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, చర్మ సౌందర్యాన్ని ఎంతగానో మెరుగుపరుచుకోవచ్చు. పైగా, వీటిలో ఎన్నో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అవి జుట్టును, చర్మాన్ని కూడా ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
ఈ గింజల్లో విటమిన్‌-ఎ, విటమిన్‌-కె, విటమిన్‌-ఇ వంటి ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇవేకాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌, జింక్‌, ఐరన్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఆయిల్‌ జుట్టును, చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆయిల్‌తో జుట్టు బాగా పెరగడంతో పాటు తళతళ మెరుస్తుంది. 
 
ఈ గింజలతో తయారు చేసిన నూనెను ముఖానికి రాసుకుంటే చల్లగా ఉంటుంది. చర్మానికి కావాల్సినంత తేమ అందుతుంది. గుమ్మడిపండు గింజల నూనె వాడడం వల్ల యాక్నె, నల్లమచ్చలు వంటివాటికి దూరంగా ఉండొచ్చు. ఈ ఆయిల్‌ని వంటకాల్లో ఉపయోగించడం వల్ల మన మూడ్స్‌ మెరుగవడమే కాదు మెనోపాజ్‌ లక్షణాల తీవ్రత సైతం తగ్గుతుందట. 
 
గుమ్మడి గింజలను సలాడ్స్‌లో వాడటం వల్ల శరీరానికి ఎంతో మంచిదని చర్మనిపుణులు చెబుతున్నారు. గుమ్మడిపండు గింజల నూనెను మాడు మీద రాసి ఒకటి లేదా రెండు గంటలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు సిల్కులా మెరుస్తాయి. అయితే తల జిడ్డుగా ఉన్నవాళ్లు మాత్రం ఈ ఆయిల్‌ని ఉపయోగించకూడదు. 
 
గుమ్మడి గింజల నూనె వాడటం వల్ల చర్మం దురదపెట్టడం, దద్దుర్లు, ఇరిటేషన్‌ వంటివి రావు. ఈ నూనె చర్మానికి కావాల్సినంత నీరును అందించడంతోపాటు కొత్త చర్మ కణాలను పునరుద్ధరిస్తుంది కూడా. అంతేకాదు చర్మం బిగువు సడలకుండా కాపాడుతుంది. 
 
ఎగ్జిమా, దద్దుర్ల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆయిల్‌లో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంది. అందుకనే స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. చర్మం రంగు కూడా మెరుస్తుంది. గుమ్మడి గింజల నూనె తో చేసిన కాప్స్యూల్స్‌ యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తాయి.