గుమ్మడి గింజలు ఆహారంగా తీసుకుంటే..?
దేహంలో కొవ్వు పేరుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శరీరంలోని అనవసరపు కొవ్వు పేరుకుపోవడం వలన స్థూలకాయం సమస్య తలెత్తి తద్వారా ఇతర అనారోగ్యాలు సైతం శరీరాన్ని చుట్టుముట్టడం అందరికీ అనుభవమే.
అయితే శరీరంలో చేరే కొవ్వు నిల్వలను ఎంతగా నివారిద్దామన్నా ఒక్కోసారి వీలుకాకపోవచ్చు. ఇలాంటి తరుణంలో తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వును శరీరం గ్రహించకుండా చేయడం ద్వారా ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. వైద్య విధానంలోనూ ఈ విధానాన్నే స్థూలకాయుల విషయంలో ఉపయోగిస్తున్నారు.
ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును ప్రేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి.
ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత ప్రేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివలన శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.