గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:04 IST)

మీ భోజనం చేసే పళ్లెంలో పరిస్థితి ఎలా ఉండాలంటే...?

అధికబరువు తగ్గించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవాలి. గింజధాన్యాలు, ప్రాసెస్ చేయనటువంటి తృణధాన్యాలు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి. కాబట్టి రాగులు, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి గింజధాన్యాలను వంటగదిలో చోటివ్వండి. వైట్ రైస్ తీసుకోవడానికి బదులుగా ఎరుపు, నలుపు లేదా గోధుమ పదార్థాలను తీసుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా వీటిని ఎంచుకుంటే చాలా మంచిది. వాటిని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
పప్పుల్లో కూడా సోయా, శనగ వంటివాటిని తీసుకోవాలి. వీటిని రెండురోజులకోసారి భోజన పదార్థాల్లో భాగం చేస్తుండాలి. ఒకవేళ మాంసాహారంపైన మనసుపోతే కొవ్వు తక్కువగా ఉన్న మాంసాన్ని తీసుకోండి. రుతువులకు అనుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవడం మరువద్దు. ఇలాంటి వాటిని రోజుకు రెండన్నా తీసుకుంటూ ఉండాలి. ఇవి ఫైబర్లను అందించడమే కాకుండా విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్‌ను శరీరానికి అందిస్తాయి. రోజుకు మన శరీరానికి 30 గ్రాముల వరకూ ఫైబర్ అవసరమవుతుంది. 
 
మనకు తెలిసితెలిసి తినే పదార్థాల నుంచే 15 శాతం కొవ్వు వచ్చి చేరుతుంది. కాబట్టి మాంసం, వెన్న, నెయ్యి, జున్ను, క్రీమ్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. కొవ్వు తక్కువుగా ఉండే పాలు, పాల పదార్థాలను తీసుకోవాలి. ప్రత్యేకించి ఒకే నూనెను కాకుండా అన్ని నూనెలను మార్చిమార్చి వంటల్లో ఉపయోగిస్తుండాలి. కుకీలు, స్నాక్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం తగ్గించేయాలి.
 
శరీరానికి అవసరమైన కేలరీల్లో కనీసం 10 శాతం కంటే తక్కువగా చక్కెరను మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు ఓ సాధారణమైన బరువున్న స్త్రీకి ఒక రోజుకు 1900 కిలోకేలరీలు అవసరమవుతాయనుకుంటే ఆమె 10 టీ స్పూన్ల చక్కెరను తీసుకోవచ్చు. చక్కెర అంటే అదేదో టీ, కాఫీల్లోనే తీసుకుంటామని అనుకుంటాం, కానీ మనం రోజువారీ తీసుకునే పదార్థాల్లో చక్కెర నిల్వలు చాలానే ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. చెప్పాలంటే చక్కెర అత్యంత స్వల్పంగా వేసుకుని కాఫీ, టీ సేవనం చేస్తే మంచిది.
 
అన్నిటికంటే ముఖ్యమైనది... మూడుపూట్ల అన్నం తినేవారు కొందరు పని ఒత్తిడి అంటూ ఓ పూట భోంచేయడం మానేస్తారు. అలాంటి పని చేయనేకూడదు. మూడు పూటలా బ్యాలెన్స్ చేసుకుంటూ భోజనం తీసుకోవాలి. మీ భోజనం చేసే పళ్లెంలో పరిస్థితి ఎలా ఉండాలంటే... పళ్లెంలో అర్థం భాగం కూరగాయలు, 1/3వ వంతు తృణధాన్యాలు, 1/3వ వంతు ప్రోటీన్లు, 150 మిల్లీ లీటర్ల పాలు లేదా పెరుగు తీసుకోవాలి. ఇలాంటిది ఆరోగ్యకరమైన భోజనం అనుకోవచ్చు. పిల్లలకు సీజన్లో వచ్చే పళ్లను స్నాక్స్‌గా ఇస్తే మంచిది. ఫ్రిజ్‌లో కూల్ డ్రింకులు, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ పెట్టి వాటిని తాగడం మానేయడం మంచిది. 
 
భోజనం చేసేటపుడు చాలామంది చక్కగా టీవీ పెట్టుకుని చేస్తుంటారు. ఏడుపు సీన్లు వచ్చినప్పుడు ఉద్వేగం చెందుతూ, కామెడీ సీన్లకు నవ్వుకుంటూ, కోపంతో ఉండే సీన్లను చూసి ఆవేశంతోనూ ఇలా చేస్తుంటారు. ఇది తప్పు. భోజనం చేసేటపుడు టీవీని పెట్టవద్దు. దాన్ని ఉపయోగించకుండా భోజనాన్ని ముగించండి. ఇక వ్యాయామం విషయానికి వస్తే కనీసం 30 నుంచి 45 నిమిషాలు తప్పనిసరి. 40 ఏళ్ల లోపు వారి ప్రతిరోజూ గంటకు 5 కిలోమీటర్లు వేగంతో నడవాలి. ఇక పిల్లల్ని ట్యూషన్లు, చదువు అని కట్టిపడేయకుండా వ్యాయామానికి కూడా చోటివ్వాలి. ఇలా చేస్తే అధిక బరువుతో అల్లాడిపోతూ వైద్యుడి చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు.