శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:17 IST)

భోజనం చేసేటప్పుడు ఇటువంటి నియమాలు పాటించండి....

చాలామంది భోజనం చేసేందుకు కూడా టైం లేదని చెపుతుంటారు. కానీ వాళ్లు చేస్తున్న పనికి మాత్రం టైం దొరుకుతుంది. అలాంటిది జీవించేందుకు భుజించే భోజనం చేసేందుకు టైం లేకపోవడం ఏంటి...? ఆ ప్రశ్నకు తావుండకూడదు. కనుక అలాంటివారు ముందుగా తెలుసుకోవలసిన విషయం... నిర్ణీత వేళకు భోజనం ముగించాలి. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అంతేగాని గబగబా మింగేయకూడదు. ఆహారాన్ని నమిలి తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే నోట్లోని లాలాజలం ఆహారంతో కలిసి కడుపులోకి ప్రవేశిస్తుంది. 
 
భోజనం తీసుకునేటప్పుడు కడుపు నిండుగా భుజించకూడదు. ఎంతగా రుచికరమైనా కూడా, మీకిష్టమైన ఆహార పదార్థాలున్నా కూడా తగినంత ఆహారమే తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. జీర్ణాశయాన్ని 1/4వ వంతు భాగం ఖాళీగా ఉంచి 3/4 వంతు మాత్రమే నింపాలి. 
 
సహజంగా చాలామంది ఆకలి వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. ఆలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిదికాదు. అలాగే మరికొంతమంది దప్పిక వేసినప్పుడు భోజనం చేస్తుంటారు. ఇదికూడా విపరీత ధోరణులకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. 
 
మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీళ్ళు మాత్రమే త్రాగండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా భోజనానికి అరగంట ముందు అలాగే భోజనం అయిన తర్వాత అరగంట వరకు నీళ్ళు త్రాగకూడదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే భోజనానికి ముందు మీ కడుపులో లాలాజలం, ఎంజైములు చేరి వుంటుంది. 
 
ఇవి జీర్ణక్రియలో బాగా తోడ్పడుతాయి. భోజనం చేసినప్పుడు ఈ లాలాజలం, ఎంజైములు ఆహారంతోబాటు కలిసి జీర్ణక్రియలో తోడ్పడుతాయి. భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్ళను త్రాగితే జీర్ణమయిన ఆహారం పూర్తిగా నీటితో కలిసి అందులో ఉన్న పోషక విలువలు శరీరానికి చేరుతాయి. మిగిలిన వ్యర్థ పదార్థాలు ఈ నీటి ద్వారా బయటకు వచ్చేస్తాయంటున్నారు. అలాగే శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుందంటున్నారు.
 
మీకు ఎన్ని పనులున్నా కూడా వాటిని పక్కన పెట్టి సమయానుసారం ఆహారాన్ని భుజించండి. ఆ తర్వాతే మీ కార్యక్రమాలను ముగించుకోండి. చద్ది అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకండి. అలాగే రెండవసారి వేడి చేసిన ఆహార పదార్థాలను కూడా భుజించకండి. మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాకే మరోసారి ఆహారాన్ని తీసుకోండి. అంతేగాని సమయం అయ్యింది కదా అని ఆకలి వేయకున్నాకూడా భోజనాన్ని తీసుకోకండి. రాత్రిపూట ఆకలి వేయకపోతే కేవలం పండ్లు మాత్రం తిని పడుకోండి. దీంతో మీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. 
 
ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితగమనంలో విశ్రాంతి తీసుకునేందుకు సమయం చాలడం లేదు. దీంతో భోజనం తిన్న వెంటనే నిద్రకుపక్రమిస్తుంటారు చాలామంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటున్నారు వైద్యులు. కాసేపు నడక సాగించండి. లేదా పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఇంటి ఆరుబయట తిరుగాడండి. అలా తిరిగిన తర్వాత నిద్రకుపక్రమించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ముఖ్యంగా రాత్రిపూట భోజనం ముగించిన వెంటనే కోపతాపాలకు తావివ్వకండి. కోపం చెందితే శరీరంలో ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి మూల కారణమవుతుందని సూచిస్తున్నారు వైద్యులు. వీలైతే రాత్రి భోజనం ముగించిన తర్వాత పడుకునే ముందు గోరువెచ్చని పాలను త్రాగండి. దీంతో సుఖవంతమైన నిద్రతోబాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు.