సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (11:52 IST)

చలికాలంలో అస్టియో ఆర్థరైటీస్‌ తీవ్రం కానుంది, గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలకాంశాలు

మన ప్రతిరోజూ జీవితంలో కీళ్లు మరీ ముఖ్యంగా మోచేయి, మోకాలు, భుజాలు వంటివి అత్యంత కీలకంగా ఉండటంతో పాటుగా మన కదలికలకూ తోడ్పడతాయి. ఒకవేళ ఏదైనా గాయం లేదా అసౌకర్యం ఈ కీళ్లకు కలిగితే, అది ఆ వ్యక్తుల  జీవితనాణ్యతపై కూడా ప్రభావం పడుతుంది. ఆస్టియో ఆర్థరైటీస్‌ అలాంటి ఓ స్థితి. అది శరీరంలో ఏ కీలుపైన అయినా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్న దశలో కీళ్ల జాయింట్ల వద్ద ఉన్న కణజాలంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా ఎముకల చివరలను కాపాడే మృదులాస్థి పొరకు కూడా నష్టం చేయవచ్చు.

 
ఆస్టియో ఆర్థరైటీస్‌ అనేది ఓ రకపు ఇన్‌ఫ్లమ్మెటరీ ఆర్థరైటీస్‌. కీళ్లు మరియు ఎముకల నడుమ సంఘర్షణను సులభతరం చేసే జిగురులాంటి పదార్ధం మృదులాస్థి (కార్టిలాజ్‌). ఈ వ్యాధి కారణంగా భరించరాని నొప్పి, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. దీనినే డీజనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌గా కూడా వ్యవహరిస్తారు. దీనికి చికిత్స ఉంది కానీ పూర్తిగా మాత్రం నయం కాదు. పెద్ద వయసు వారిలో అతి సహజంగా ఇది కనిపించడంతో పాటుగా వయసుతో పాటు సమస్య కూడా తీవ్రమవుతుంది.

 
శీతాకాలంలో ఆస్టియో ఆర్థరైటీస్‌తో బాధపడే వారిలో సమస్య మరింత తీవ్రమవుతుంది. విటమిన్‌ డీ తక్కువగా లభించడం వల్ల ఎముకలు, కీళ్లు మరింత బలహీనపడి సమస్య మరింత తీవ్రమూ అవుతుంది. ఈ శీతాకాలంలో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు రోగులు అనుసరించాల్సిన విధానాలు:

 
విటమిన్‌ డీ: సూర్యోదయ విటమిన్‌గా దీనిని పేర్కొంటారు. సూర్యకాంతి ద్వారా లేదా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇది లభిస్తుంది. శీతగాలులు పెరగడం వల్ల ఎండలో తిరగడం తగ్గి విటమిన్‌ డీ లోపించే అవకాశాలున్నాయి. తద్వారా నొప్పులూ పెరగవచ్చు. రోజూ 600 ఐయు విటమిన్‌ డీ తీసుకునేలా జాగ్రత్తపడాలి.
 
వ్యాయామాలు చేయాలి: శారీరక వ్యాయామాలు ద్వారా ఎముకల బలం పెరగడంతో పాటుగా ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది.
 
విశ్రాంతి: రాత్రిళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. తగినంత విశ్రాంతి, నిద్ర ద్వారా సమస్య రాకుండా చేసుకోవచ్చు.
 
శరీరం వెచ్చగా ఉంచుకోవాలి: శరీరం వెచ్చగా ఉంచేలా కప్పుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటీస్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
నీరు అధికంగా తాగాలి: చల్లగాలుల్లో చాలామంది తగినంతగా నీరు తీసుకోవడం మరిచిపోతుంటారు. తగినంతగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపడం సాధ్యమవుతుంది.
 
నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి తప్ప, మెడికల్‌ షాప్‌లలో నేరుగా మందులు కొని వాడటం శ్రేయస్కరం కాదు.
 
- డాక్టర్‌ వీరేంద్ర ముద్నూర్‌, ఆర్థోపెడిక్స్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌