మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 మార్చి 2021 (21:30 IST)

ప్రతిరోజూ బాదములను తింటే ముఖంపై ముడతలు పోతాయి, కాంతివంతమైన చర్మం

రోజువారీ చర్మ సంరక్షణ విధానంలో బాదములను జోడించుకోవడానికి ఒకటి కన్నా ఎక్కువ కారణాలే ఉన్నాయని నూతన అధ్యయనం వెల్లడిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వద్ద నిర్వహించిన ఓ అధ్యయనంలో, ప్రతిరోజూ బాదములను తినడం వల్ల చర్మంపై ముడతల తీవ్రత తగ్గడంతో పాటుగా ఋతుచక్రం ఆగిన మహిళలలో స్కిన్‌ పిగ్మంటేషన్‌ కూడా తగ్గుతుందని తేలింది.
 
‘‘ప్రతి రోజూ బాదములు తినడమనేది ముఖంలో ముడతలు తగ్గటానికి ప్రభావవంతమైన మార్గంగా ఉండటంతో పాటుగా ఫిజ్పాట్రిక్‌ స్కిన్‌ టైప్స్‌ 1 మరియు 2 కలిగిన ఋతుచక్రం ఆగిన మహిళల్లో చర్మ సౌందర్యమూ మెరుగవుతుంది..’’ అని ఈ అధ్యయన లీడ్‌ రీసెర్చర్‌, డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ రాజా శివమణి అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌ ఇ) మరియు చక్కటి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ సహా బహుళ పోషకాలు కలిగిన సంపూర్ణ ఆహారంగా బాదములను చెప్పాల్సి ఉంటుంది. బాదములలో యాంటీఆక్సిడెంట్‌ ఫంక్షన్స్‌ అధికంగా ఉంటాయి. ఋతుచక్రం ఆగిన మహిళల్లో ముడతలు, స్కిన్‌ టోన్‌ ప్రభావానికి ఇవి పాక్షికంగా బాధ్యత వహించేందుకు అవకాశాలున్నాయి’’ అని ఆయన జోడించారు.
 
ఈ అధ్యయనం గురించి డాక్టర్‌  గీతికా మిట్టల్‌ గుప్తా, డెర్మటాలజిస్ట్‌-కాస్మెటాలజిస్ట్‌ మాట్లాడుతూ, ‘‘ప్రతి రోజూ బాదం తినడం వల్ల కేవలం ముఖంలో ముడతలు తగ్గడం మాత్రమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తేలడం సంతోషించతగ్గ అంశం. పర్యావరణ అంశాలకు తోడు, సూర్యకాంతి ప్రభావం చేత అసమాన చర్మపు రంగు కలిగిన భారతదేశంలో ఈ ఫలితాలు సంబంధితంగా ఉంటాయి. బాదములలో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటుగా అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్‌, పాలీఫినాల్స్‌ కూడా ఉన్నాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఇవి తోడ్పడతాయి. మహిళలు తమ రోజువారీ ఆరోగ్యంలో బాదములు జోడించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన చర్మం పొందవచ్చు’’ అని అన్నారు.
 
న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీల్‌ కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ఈ కాలుష్యకాలంలో మన చర్మ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈ నూతన అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మహిళలు మరీ ముఖ్యంగా ఋతుచక్రం ఆగిన మహిళలు ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను తమ చర్మ ఆరోగ్యం కోసం తీసుకోవడం మంచిదని నేను సూచిస్తున్నాను’’ అని అన్నారు.