శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 మార్చి 2020 (21:58 IST)

యాలుక్కాయల కషాయం తాగితే ఏమవుతుంది?

నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వంటకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలుకలో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. దానిలోని గింజలు కూడా ఔషధల గుణాలను కలిగి ఉన్నాయి. 40 సంవత్సరాలు వాటిమీద పరిశోధనలు జరిగాయి. సువాసన కలిగిన యాలుక గింజలు కడుపు నొప్పిని నయం చేస్తాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. 
 
ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, కిడ్నీలో రాళ్ళు, ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలుకలు ఉపయోగించబడుకున్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలుకల "టీ" తాగితే ప్రశాంతతను పొందుతారు.
 
టీ పొడి తక్కువగానూ, యాలుక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను ఆఘ్రాణించడం వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట. 
 
నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి కేవలం యాలుక్కాయలను నోట్లో వోసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుందట. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిదికదా! 
 
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కళ్ళు తిరగడం జరిగితే యాలుక్కాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. నాలుగైదు యాలుక్కాయలను చితగ్గొట్టి అరగ్లాసు నీటిలో వేసి, కషాయంలాగా కాచి, అందులో కొంచెం పటికబెల్లం పొడి కలుపుకుని తాగితే తలతిరుగుడు వెంటనే తగ్గిపోతుంది. 
 
ఎక్కిళ్ళను వెంటనే ఆపగలిగే శక్తి యాలుకలకు ఉంది. రెండు యాలుకలను చితగ్గొట్టి, పుదీనా ఆకులను వేసి, అరగ్లాసు నీటిలో బాగా కాచి వడకట్టాలి. తర్వాత గోరువెచ్చగా అయ్యేవరకూ చల్లార్చి తాగితే వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. 
 
వాయు సమస్యతో బాధపడేవారు బిడియపడకుండా యాలుక్కాయతో ఉపశమనం పొందవచ్చు. యాలుకలను బాగా ఎండబెట్టి దంచి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ తీసుకుని అర గ్లాసు నీటిలో కషాయంలాగా మరిగించాలి. ఆహారం తీసుకునే ముందు ఈ యాలుక్కాయల కషాయం తాగితే వాయు సమస్య తీరిపోతుంది.