'ఇనుము'తో బట్టతలకు అడ్డుకట్ట
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే.. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పాటు.. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఫలితంగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేస్తుంది.
సాధారణంగా, వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభం కావడంతో చాలా మంది షాంపూలు, హెయిర్ మాస్కులు వాడటం చేస్తుంటారు. సీరమ్స్, ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే వీటితోపాటు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకోటుంది. అదే ఆహారంలో ఐరన్ తీసుకోవడం.
రోజూ తగినంత ఐరన్ అందకుంటే జుట్టు రాలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యలు, మానసిక ఇబ్బందులు, కాలుష్యంతోపాటు ఐరన్ లోపం కూడా వెంట్రుకలు రాలేందుకు ప్రధాన కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది.
అందుకే ఆహారంలో రోజూ తప్పని సరిగా ఐరన్ శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. సాధారణంగా మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
మహిళలు రోజూ 18 మిల్లీ గ్రాములు, పురుషులు 8 మిల్లీ గ్రాముల ఐరన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్లు, పొద్దు తిరుగుడు గింజలు, పాలు, పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌లలో ఐరన్ అధికంగా ఉంటుందని, వీటిని తీసుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.