అల్లం తరుగు వేడిచేసి వడగట్టి తేనె కలిపి స్త్రీలు తీసుకుంటే?
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఋతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల ముందు నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా, నడుం నొప్పిగా ఉంటుంది. మరికొందరిలో నెలసరి సమయంలో ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్యకు నివారణ మందులతో కాకుండా ప్రకృతి ప్రసాదించిన పదార్దాలతో ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
1. ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం నెలసరి సమయంలో మంచిది కాదు. వీటికి బదులుగా తాజా పండ్లను భోజనంలో చేర్చుకోవడం మంచిది. అరటి పండును తరచుగా తీసుకోవాలి. ఇందులోని మెగ్నీషియం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తాజా ఆకుకూరల ద్వారా శరీరానికి కావలసినంత ఇనుము కూడా అందుతుంది.
2. గ్లాసు వేడి నీటిలో కొద్దిగా అల్లం తరుగు వేసి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తేనె కలిపి రోజులో రెండు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
3. నీటిని ఎంత ఎక్కువగా తీసుకంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ఈ నియమాన్ని పాటించడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
4. రోజులో ఒక సారి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతు దిగుతుంటే హాయిగా ఉంటుంది. వీటిలోని ఔషద గుణాలు అలసట పోగొట్టడమే కాకుండా నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.
5. అంతేకాకుండా నెలసరి సమయంలో మసాలా పుడ్స్‌కి దూరంగా ఉండాలి. చలువ చేసే పదార్దాలను ఎక్కువగా తీసుకోవాలి.