సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (14:18 IST)

కంటి మంటలా.. అందుకు కారణాలివే..?

అదేపనిగా కంప్యూటర్ ముందు పనిచేసినా, ఎక్కువ సేపు టీవీ చూసినా తలనొప్పి వస్తుందంటే.. అందుకు కారణం కళ్లు అలసటకు గురయ్యాయని అర్థం. ఈ ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే.. అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి..
 
కళ్ల మసకలు, తలనొప్పి, కంటి నుండి నీరు కారడం, కంటి మంటలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటే కళ్లు అలసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇందుకు చాలా కారణాలుంటాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
ఎస్థినోపియా అనే కళ్ల అలసటకు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడడం ప్రధాన కారణాలు. వీటితోపాటు చిన్నవిగా ముద్రించిన అక్షరాలను చదవడం తగిన వెలుతురు లేని చోట కూర్చుని చదవడం వంటి అలవాట్ల వలన కంటి కండరాల మీద ఒత్తిడి పడి కళ్లు అలసటకు లోనవుతాయి. దాంతో డబుల్ ఇమేజ్, తలనొప్పి, మైల్డ్ మ్రైగ్రేన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంటి మీద పడే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం తప్పకుండా చేయాలి.
 
కంప్యూటర్ ముందు గంటలతరబడి పనిచేసే వాళ్లు ప్రతిరెండు గంటలకోసారి పని ఆపేసి కనీసం 10 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలాముఖ్యం. అప్పుడప్పుడూ దూరం, దగ్గర వస్తువులను చూసే కంటి వ్యాయామాలు చేయాలి. కళ్లను మూసి రెండు దోసిళ్లకు కళ్ల మీద ఉంచి మోచేతులను టేబుల్ మీద ఆనించి 5 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
 
చల్లని నీటిలో తడిపిన దూదిని మూసిన కనురెప్పల మీద 5 నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తొలగిపోతాయి. కంటి నుండి నీరు కారుతున్నా, లేదా దురదలు పెడుతున్నా కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి. మెడికల్ షాపులో దొరికే ఐ డ్రాప్స్‌ను వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా వాడకూడదు. రోజుకు కనీసం 7 గంటలపాటైనా నిద్రపోవాలి.