రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచే పండ్లు ఏంటి?
హైటెక్ జీవనశైలిలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా చిన్నవయసులోనే బీపీ, షుగర్, ఉబకాయం వంటి వ్యాధులబారిన పడుతున్నారు. ముఖ్యంగా పెక్కుమంది రక్తపోటు బారిన పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి హై బీపీ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీపీని అదుపులో ఉంచుకోనిపక్షంలో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల బీపీని అదుపులో ఉంచేలా ఆహార పదార్థాలు తీసుకోవాలి.
ప్రతీ సంవత్సరం హై బీపీ వల్ల తొమ్మిది మిలియన్ల మంది మరణిస్తున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. బీపీ ఎక్కువ ఉందని బెంగపడాల్సిన అవసరం లేకుండా మనకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండే పండ్లను తీసుకుంటే సరిపోతుంది.
* సర్వసాధారణంగా ఎక్కడ చూసినా కంటికి కనిపించే పండ్లు అరటిపళ్లు. వీటిని ఆరగించడం ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం శరీరానికి మంచి చేస్తుంది. అరటిపండ్లు హైబీపీ రాకుండా సాధారణ రక్తప్రసరణ జరగటానికి దోహదపడతాయి.
* ప్రతి రోజూ మీగడ తీసిన పాలు తాగాలి. ఇందులోని కాల్షియం, విటమిన్-డి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి. దీంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యల్ని నివారించాలంటే స్కిమ్డ్ మిల్క్ తాగితే ఫలితం ఉంటుంది.
* పుచ్చకాయ కేవలం ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి పనిచేయడమే కాకుండా ఇందులో దొరికే పొటాషియం, పైబర్, విటమిన్-ఎ వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.
* విటమిన్-సి, ఫైబర్ ఉండే నారింజ పండు బ్లడ్‌ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. నారింజ పండ్లు తినొచ్చు లేదా వాటిని జ్యూస్ చేసుకుని తాగినా హైబీపీ ఉండేవారికి మంచిది.
* ఫోలిక్ ఆసిడ్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్-ఇ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు తినటం వల్ల బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
* బీపీ ఎక్కువగా ఉండేవారు పాలకూరని తినాలి. ఇందులో తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. గుండె రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.