పుదీనాను వేసవిలో ఇలా వాడితే...?
పుదీనాను వేసవిలో ఇలా వాడవచ్చు. కూరలు, చట్నీల్లో కాకుండా.. పుదీనాను జ్యూస్‌లలో కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. పుదీనా నిజానికి మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఇందులో ఉంటాయి. కనుక వేసవిలో పుదీనాను కచ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాను తీసుకోవడం వల్ల ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఎండలో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా మజ్జిగ తాగితే శరీరం వెంటనే చల్లబడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుదీనాను తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనాను వేసవిలో మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. లేదా నేరుగా పుదీనా రసం తీసుకోవచ్చు. అదీ కూడా వద్దనుకుంటే పుదీనాను సలాడ్స్ లో వేసుకుని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగవచ్చు. ఎలా తీసుకున్నా పుదీనాతో మనకు లాభమే కలుగుతుంది.
వేసవిలో మాంసాహారం తింటే కొందరికి పడదు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం వేడి చేయకుండా ఉంటుంది. దగ్గు, జలుబు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు పుదీనాను తింటే ఫలితం ఉంటుంది. పుదీనాను రోజూ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.