మంగళవారం, 28 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chj
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (18:36 IST)

శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి... తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి

కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని 'తులసి ద్వా

కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని 'తులసి ద్వాదశి' అని కూడా అంటూ వుంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీమహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట. అందువల్ల ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించక పోయినా ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
 
దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించినరోజు కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
 
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీ రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
 
'క్షీరాబ్ది ద్వాదశి' రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ శుభ దినాన శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీమహావిష్ణువు తులసి కోటలోకి ప్రవేశిస్తాడని అంటారు. తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువై వుంటారు గనుక, ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని  ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. 
 
తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి. సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.