గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (18:11 IST)

మితిమీరిన విశ్వాసం వద్దు..! పుష్కరాలను గుర్తుంచుకోండి...!! బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో

ఎప్పటి నుంచో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ఇందులో ఏముంది అనే మితిమీరిన విశ్వాసం అసలు పనికిరాదు. పుష్కరాలలో తొక్కిసలాట సంఘటనను గుర్తుంచుకోవాలి. మనకు అనుభవం ఉండవచ్చుగాక, కానీ జాగ్రత్త మాత్రం అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు అన్నారు. అన్నమయ్య భవన్‌లో మంగళవారం బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష జరిపారు. 
 
అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పుష్కరాల సంఘటనను దృష్టి పెట్టుకోవాలని తెలిపారు. ప్రత్యేకించి గరుడసేవ ఏర్పాట్లపై చర్చించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలను 24 గంటలకు తెరవాలని ఆదేశించారు. అయితే అక్కడ చిరుతల సంచారం ఉన్న కారణంగా ప్రతీ 25 మెట్లకు ఒక్కరిని నియమించి భక్తులకు సూచనలివ్వాలిచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రవాణా సౌకర్యాలపై చర్చించారు. 
 
తిరుమల బ్రహ్మోత్సావాల సందర్భంగా రవాణా సౌకర్యాన్ని పెంచాలని అన్నారు. కనీసం 452 బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. వీటి ద్వారా 1585 ట్రిప్పులు నడస్తున్నాయని ఈవోకు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా 2289 ట్రిప్పులు నడుపుతామని తెలిపారు. అయితే ఒక్క గరుడసేవ రోజున 512 బస్సులతో 3500 ట్రిప్పులు నడుపుతామని తెలిపారు. అందుకు తగిన పార్కింగులను నిర్ణయించాలని ఈవో అధికారులను కోరారు.