శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్

వామ్మో మెంతులతో ఎన్ని ఉపయోగాలో?

మెంతులు లేని వంటిల్లు ఉండదు. పచ్చళ్లూ, రసాలూ, కూరల తయారీలో వాడే మెంతులు జుట్టుకూ కూడా చక్కని పోషణ ఇస్తాయి. మెంతుల్లోని మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి.
 
మెంతులను నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడాన్ని నిరోధిస్తుంది. మెంతుల్లోని పోషకాలు చుండ్రును నివారించడంలో కీలకంగా పనిచేస్తాయి. 
 
గుప్పెడు మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు మెత్తని ముద్దలా చేసుకోని అందులో ఒక చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. 
 
పావు కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో అరచెంచా మెంతులు వేసి కొన్ని గంటలు పాటూ నానబెట్టాలి. ఈ నూనెను తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. 
 
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. రెండు చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టి అందులో గుప్పెడు కరివేపాకును వేసి ముద్దలా చేసుకోని జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.