గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:45 IST)

మొలకెత్తిన గింజలు ... ఆరోగ్యానికెంతో మంచివి"..!

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? జుట్టు బాగా రాలిపోతోందా? రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు బాధిస్తున్నాయా??.. వీటన్నింటికీ ఒకే మందు.. మొలకెత్తిన గింజలు.

ఈ గింజల్లో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే, మరికొంతమంది కూరల్లో కలిపి తింటారు. ఈ క్రమంలో మొలకెత్తిన గింజల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో చూద్దామా??
 
ఇంట్లోనే సులభంగా..
మొలకెత్తిన గింజలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే పెసలు, పల్లీలు, శెనగలు.. మొదలైన గింజల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నాననివ్వాలి. అంతే.. మీకు కావలసిన స్ప్రౌట్స్ రడీ..
 
జీవక్రియలు వేగవంతం
శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేయడంలో తోడ్పడే అమైనో ఆమ్లాలు స్ప్రౌట్స్‌లో అధిక మొత్తంలో లభిస్తాయి. అలాగే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
 
ఇన్ఫెక్షన్లకు దూరంగా
మొలకెత్తిన గింజల్లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో హానికారక ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ నాశనమవుతాయి. ఫలితంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
 
 
వ్యర్థాలను తొలగిస్తాయి
స్ప్రౌట్స్ త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఇవి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడంతో పాటు రక్తంలో ఉండే మలినాలు, వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర వహిస్తాయి.
 
 
బరువు తగ్గాలంటే
బరువు తగ్గించడంలో కూడా మొలకెత్తిన గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ గింజల్లో ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.. కాబట్టి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఈ గింజలను విడిగా తినడం ఇష్టం లేకపోతే సలాడ్స్‌లోనైనా వేసుకొని తీసుకోవచ్చు.
 
ఎర్రరక్త కణాల ఉత్పత్తికి
పెసలు, మెంతులు, కాయధాన్యాలు.. వంటి రకాలకు చెందిన స్ప్రౌట్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి, శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారు మొలకెత్తిన గింజల్ని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
 
కొవ్వు తగ్గుతుంది
వివిధ రకాల గింజలు మొక్కల నుంచి సహజసిద్ధంగా లభించేవి. కాబట్టి ఇవి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయులు తగ్గుతాయి. దీనివల్ల గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు.. మొదలైనవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
 
అదుపులో బీపీ
మీరు తీసుకునే ఆహారంలో సోడియం స్థాయులు ఎక్కువగా ఉన్నాయా? దీనివల్ల శరీరంలోకి అధిక సోడియం చేరి రక్తపోటు సంబంధిత సమస్యలేమైనా తలెత్తాయా? అయితే వెంటనే మొలకెత్తిన గింజల్ని ఆహారంగా తీసుకోండి. ఎందుకంటే వీటిలో సోడియం ఉండదు. కాబట్టి శరీరంలో బీపీని అదుపులో ఉంచి.. హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడతాయి.
 
మలబద్ధకం నివారణకు
మొలకెత్తిన గింజల్లో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యను పారదోలి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
 
చూశారుగా.. స్ప్రౌట్స్ వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలున్నాయో! కానీ ఒక్క ముఖ్య విషయం.. వీటిలో శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా తీసుకోవడమూ మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.