బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (14:52 IST)

అధికారంలోకి వస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తా : డోనాల్డ్ ట్రంప్

donald trump
అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తుందని, తాను అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వచ్చే యేడాది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందుకోసం ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన ఏకంగా భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తోందని, తనను అధికారంలోకి తీసుకొస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తానని ఒక వార్తా చానెల్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. 'భారత్ మనపై అత్యంత భారీగా పన్నులు విధిస్తోంది. ఉదాహరణకు హార్లీ-డేవిడ్సన్ బైకుల ఎగుమతిని చూస్తే ఏకంగా 100 శాతం, 150, 200 శాతాల వరకూ సుంకాన్ని విధిస్తోంది. 
 
మన దేశంలో మాత్రం ఎటువంటి పన్ను లేకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తమ దేశానికి వచ్చి పరిశ్రమను నిర్మిస్తే పన్ను ఉండదని ఆఫర్ ఇస్తోంది. కానీ అది మనకు సమ్మతం కాదు. ఈ విషయంలో నా హయాంలో చాలా గట్టిగానే ఆ దేశంతో పోరాడాను. మీరు ఏమైనా అనుకోండి, వాళ్లు మనపై సుంకం విధిస్తే, మనం కూడా విధించి తీరాల్సిందే' అని ట్రంప్ తేల్చిచెప్పారు.