శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (12:24 IST)

గగనతలాన్ని తెరిచిన పాకిస్థాన్.. భారత విమానాలకు ప్రవేశం ఉందా? లేదా?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇపుడు తాజాగా తెరిచినట్టు ప్రకటించింది. తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖకు ఆవల బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూసివేసిన 11 వాయుమార్గాల్లో ఒక దానిని తెరిచింది. మార్చిలో పాక్షికంగా వాయుమార్గాలను తెరిచినప్పటికీ భారత విమానాలను అనుమతించలేదు. తాజాగా, అన్ని మార్గాలను తెరిచినట్టు ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ గగనతలంమీదుగా అన్ని దేశాలకు చెందిన విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. 

కాగా, పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానయాన సంస్థలకు రూ.491 కోట్ల మేరకు నష్టంవాటిల్లినట్టు అంచనా. పాక్ గగనతలం మూసివేతతో ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు రాకపోకలు సాగించే ఇండిగో విమాన సంస్థ ఏకంగా తన సర్వీసునే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇపుడు 'తక్షణమే పాకిస్థాన్ గగనతలం ప్రచురించిన ఏటీఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల విమానాల రాకపోకల కోసం తెరిచి ఉంది" అని పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్‌మెన్‌లకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది.