అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో వైరల్.. హా హా వావ్ అంటోన్న ఎలెన్ మస్క్ (Video)
అక్రమ వలసలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా వివాదానికి దారితీసింది. ఇప్పటికే రెండుసార్లు అమెరికా సైనిక విమానం భారత గడ్డపై అక్రమ వలసదారులను దించి వెళ్లింది. ఆ సమయంలో అక్రమ వలసదారులైన భారతీయులను ఖైదీల తరహాలో చేతులు కట్టేసి విమానం నుంచి దిగబెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ వలస విధానాలు భారతదేశంలో కూడా విమర్శలకు దారితీశాయి, బహిష్కరించబడిన భారతీయ పౌరుల పట్ల వ్యవహరించే తీరుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఆరోపణలు ప్రస్తుతం నిజమయ్యేలా అక్రమ వలసదారులకు సంకెళ్లు కట్టిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, అధికారులు అక్రమ వలసదారులను సంకెళ్లతో అడ్డుకుని, వారిని బహిష్కరించే ముందు ఎలా ఉన్నారో చూపబడింది. ఈ ఫుటేజ్‌లో అధికారులు ఎటువంటి పత్రాలు లేని వలసదారులను వెనక్కి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చూపిస్తుంది.
విమానాశ్రయ రన్‌వే దగ్గర వలసదారులకు సంకెళ్ళు వేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వలసదారులను ఇలా ఖైదీల తరహాలో బంధించడం సరికాదంటూ ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్నాయి. అయితే ఇదంతా అమెరికా ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
ఇది చాలదన్నట్లు ఈ వీడియోకు టెక్ బిలియనీర్, యు.ఎస్. ప్రభుత్వ సలహాదారు ఎలెన్ మస్క్ "హాహా వావ్" అనే క్యాప్షన్‌తో వీడియోను రీట్వీట్ చేయడం చర్చను మరింత తీవ్రతరం చేసింది. అక్రమ వలసలను అణిచివేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార హామీని నెరవేర్చుతూ ట్రంప్ పరిపాలన కఠినమైన వలస విధానాలను అమలు చేస్తోంది.