శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (09:17 IST)

కరోనాపై ఆయుర్వేదం ప్రయోగం.. భారత్‌, అమెరికా సంయుక్త పరిశోధనలు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు భారత సంప్రదాయ వైద్యం ఆయుర్వేద ప్రయోగం ఎలా వుంటుందన్న దానిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

భారత్, అమెరికా దేశాలు ఇందుకు సంయుక్తంగా నడుం బిగించాయి. రెండు దేశాల ఆయుర్వేద నిపుణులు, శాస్త్రవేత్తలు సమాలోచనలు చేస్తున్నారు. ఆయుర్వేద మందులతో సంయుక్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వాషింగ్టన్‌లోని భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధూ అన్నారు.

భారత్‌, అమెరికాకు చెందిన నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, వైద్యులు జరిగిన వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారని తరణ్‌జీత్‌ వెల్లడించారు. కొవిడ్‌-19పై పోరాడేందుకు వీరంతా ఒక్కతాటిపైకి వచ్చారని తెలిపారు. ‘సంయుక్త పరిశోధన, బోధన, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు మా సంస్థలన్నీ సహకరిస్తున్నాయి.

కరోనా వైరస్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు రెండు దేశాల ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు చేతులు కలిపారు’ అని సంధూ తెలిపారు. ‘మా శాస్త్రవేత్తలు ఈ రంగంలో తమకున్న అనుభవం, విజ్ఞానం, పరిశోధన అంశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు’ అని తరణ్‌జీత్‌ తెలిపారు. 
 
భారత్‌, అమెరికా శాస్త్ర సాంకేతిక వేదిక (ఐయూఎస్‌ఎస్‌టీఎఫ్‌) తమకొచ్చిన ప్రతిపాదనలు వేగంగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. భారత ఔషధ కంపెనీలు ప్రపంచంలోనే అతితక్కువ ధరకే మందులు, వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగాయని ప్రశంసించారు. 

మహమ్మారిపై పోరాటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత వ్యాక్సిన్‌ కంపెనీలు, అమెరికా సంస్థల మధ్య కనీసం మూడు సహకార ఒప్పందాలు కొనసాగుతున్నాయన్నారు.