శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (15:00 IST)

ఇమ్రాన్ వల్లే పాకిస్థాన్ ప్రపంచానికి శత్రువైంది : బిలావల్ భుట్టో

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై, అతని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇండియా పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థుతుల నేపథ్యంలో బిలావల్‌ను ప్రశ్నించగా ఆయన ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
 
ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్‌లో ఇకపై స్థానం ఉండబోదని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బిలావల్ భుట్టో ఇలా అన్నారు, 'ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌ను శత్రు దేశంగా చూడటమే కాకుండా పాకిస్థాన్‌తో అనేక రంగాల్లో సంబంధాలను తెంచుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాద నియంత్రణకు నిజంగానే చర్యలు తీసుకుని ఉంటే ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌పై ఎందుకు మండిపడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నిజంగా శాంతిని కోరుకుంటే ప్రపంచ దేశాలకు క్షమాపణ చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేసారు.
 
అలాగే ఇమ్రాన్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు తీవ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ చర్యల వల్లే భారత్ పాకిస్థాన్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు చాలా తీవ్రమయ్యాయని మండిపడ్డారు.

ఇమ్రాన్‌కి ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీ ఉంటే మేము చెప్పే మూడు అంశాలను తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. అందులో మొదటిది పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించడం, రెండవది నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతును నిలిపివేయడం కాగా ఇమ్రాన్ మంత్రివర్గంలో ఉండి ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందిస్తున్న ముగ్గురు మంత్రులను తొలగించి వారిపై విచారణ జరిపించడం మూడవ అంశంగా పేర్కొన్నారు.