గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (09:36 IST)

ప్రపంచంలో చైనాకు ప్రత్యామ్నాయం భారత్ మాత్రమే : బిల్ గేట్స్

ప్రపంచంలో చైనాకు ప్రత్యామ్నాయం భారతదేశం ఒక్కటేనని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో జరుగుతున్న ఫిన్ టెక్ ఫెస్టివల్‌లో ఆయన వర్చ్యువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచ దేశాల్లోని ఎవరైనా చైనాను వదిలేసి, మరో దేశంపై అధ్యయనం చేయాలని భావిస్తే, వారంతా కచ్చితంగా ఇండియావైపే చూడాలి" అని అభిప్రాయపడ్డారు. 
 
దీనికి కారణం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ, వినియోగంలోనూ భారత్ ఇతర దేశాలకంటే ఎంతో ముందు ఉందని తెలిపారు. వినూత్న ఆర్థిక విధానాలను అవలంబించడంలో ఇండియా మిగతా దేశాల కన్నా ఎంతో ముందు నిలిచిందని, అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని అన్నారు.
 
డిజిటల్ పేమెంట్స్, అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రపంచంలోని అతిపెద్ద బయో మెట్రిక్ డేటా బేస్ ఇప్పటికే భారత్‌లో సిద్ధమైందని, డబ్బు బట్వాడా బ్యాంకుల ద్వారా కాకుండా, స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా జరుగుతుండటం కూడా శరవేగంగా విస్తరిస్తోందని ఆయన గుర్తుచేశారు. పేదలకు సంక్షేమ పథకాలను దగ్గర చేయడంలోనూ టెక్నాలజీని ఇండియా ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయని అన్నారు.
 
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని పారద్రోలేందుకు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం, దేశం మొత్తాన్ని నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని ఆయన అన్నారు. వైర్‌లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది ఇండియాలోనేనని గుర్తు చేసిన బిల్ గేట్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారత్‌లో చౌకగా ఉన్నాయని, దీంతో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు కనిపిస్తున్నాయని అన్నారు.
 
ఫేస్‌బుక్, అమెజాన్, వాల్‌మార్ట్, పేటీఎం సహా అన్ని కంపెనీలూ తమ సేవలకు యూపీఐ ప్లాట్ ఫామ్‌ను వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఇదే తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.