గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (11:02 IST)

లిబియాలో ప‌డ‌వ ప్ర‌మ‌దం... 57 మంది జ‌ల‌స‌మాధి!

లిబియాలో వలసదారులతో వెళుతున్న పడవ సముద్రంలో మునిగిపోవ‌డంపై ఆ దేశంలో తీవ్ర విచారం వ్య‌క్తం అవుతోంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 57 మంది వ‌ల‌స‌దారులు జలసమాధి అయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్టు అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

మృతుల్లో 20 మందికి పైగా మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరందరూ మధ్యధ‌రా సముద్రం మీదుగా, మరింత మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో నిలిచిపోయింది. ఆ తర్వాత స‌ముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అల‌లు ఉప్పొంగ‌డంతో ఒక్కసారిగా మునిగిపోయింది.

ఈ ప్ర‌మాదంపై లిబియ‌న్ కోస్ట్ గార్డులు, యూరోపియ‌న్ అధారిటీపై మాన‌వ‌తావాదులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకేసారి వంద మంది జ‌ల‌స‌మాధికి కార‌ణ‌మ‌య్యార‌ని, స‌ముద్ర‌యానంపై క‌నీస జాగ్ర‌త్త‌లు లేవ‌ని విమ‌ర్శిస్తున్నారు. పొట్ట‌కూటి కోసం వ‌ల‌స పోతున్న కార్మిక కుటుంబాల‌ను న‌ట్టేట ముంచార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో 30 మంది వ‌ర‌కు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. లిబియ‌న్ క్యాపిట‌ల్ ట్రిపోలీకి వారు చేరుకున్నారు.