గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:05 IST)

ఆక్రమణ అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ కొత్త పేర్లు.. మే నెల నుంచి అమల్లోకి...

indo - china
పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ చైనా... భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని క్రమంగా అక్రమించుకునేల కుట్రలు చేస్తుంది. ఇప్పటికే ఆక్రమించుకున్న పలు ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టింది. ఈ ప్రాంతాలను మే నెల ఒకటో తేదీ నుంచి కొత్త పేర్లతో పిలవాలని సూచించింది. ఈ మేరకు తమ దేశ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే, సరిహద్దులపై వివాదాస్పద ప్రకటన చేసిన డ్రాగన్ కంట్రీ... మరోమారు కవ్వింపు చర్యలకు దిగింది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా.. ఈప్రాంతాలు తమవేనంటూ వాటి పేర్లు మార్చేస్తుంది. ఈ మేరకు 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన ఆ జాబితాను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ విషయాన్ని డ్రాగన్ కంట్రీ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ పేరు మార్పులు మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండటం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. 
 
అందుకే ఆయా ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్‌లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్టు చైనా ప్రభుత్వం పేర్కొందని, గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అరుణాచల్‌‌ను దక్షిణ టిబెట్‌గా వ్యవహరిస్తూ జాంగ్నాన్ అని నామకరణం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా లిస్టును విడుదల చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017 నుంచి ఇలా కొత్త పేర్లతో చైనా లిస్టు విడుదల చేస్తుంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా డ్రాగన్ కంట్రీ తేలిగ్గా తీసుకుంటుంది.