చనిపోయినా సరే చెప్పకూడదు.. రహస్యంగా చైనా ప్రజలకు కరోనా వ్యాక్సిన్
ప్రాణం పోయినా సరే కరోనా వ్యాక్సిన్ వేసినట్టుగా బయటకు చెప్పకూడదని దేశ ప్రజలను చైనా సర్కారు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టిన చైనా.. ఇపుడు ఆ వ్యాక్సిన్‌ను గుట్టుచప్పుడు కాకుండా తమ దేశ ప్రజలకు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా అత్యవసర వ్యాక్సిన్‌వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి ఎవరికీ చెప్పొద్దంటూ వ్యాక్సినేషన్ సమయంలోనే వారితో 'నాన్ డిస్‌క్లోజర్' ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు సమాచారం.
వాస్తవానికి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రస్తుత మూడో దశ క్లినికల్ పరీక్షల్లో ఉన్నాయి. అయితే, ఈ పరీక్షలు పూర్తికాకముందే, అత్యవసర వినియోగానికి చైనా తెరలేపింది. ఇందులోభాగంగా తొలుత కోవిడ్ వారియర్లుగా పేర్కొనే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల సిబ్బంది, సైనికులు, పోలీసులు, కస్టమ్స్, సూపర్ మార్కెట్ల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటివారికి 'అత్యవసర' వ్యాక్సిన్లు వేస్తోంది. దీంతో వారి ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
'అత్యవసర' వ్యాక్సిన్ వేయించుకొని లక్షలాది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైగా అత్యవసర వ్యాక్సిన్‌వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి ఎవరికీ చెప్పొద్దంటూ వ్యాక్సినేషన్ సమయంలోనే వారితో 'నాన్ డిస్‌క్లోజర్' ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యవసర వ్యాక్సిన్ అనర్థాలు సృష్టిస్తోందని తెలిసినా చైనాలోని కంపెనీల ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసం చేయలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు.