మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (19:13 IST)

మసూద్... దలైలామా ఒక్కటా... వెళ్లి భిక్షమెత్తుకోండి... నెటిజన్ ఆవేశం

జైషే మహ్మద్ నేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎ‌స్సీ)లో భారత్‌తో సహా ఇతర దేశాలు చేసిన ప్రతిపాదనకు చైనా మళ్లీ అడ్డుతగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జర్నలిస్టు హమీద్ మీర్ ట్విటర్లో దలైలామాను ‘‘తీవ్రవాది’’గా పేర్కొంటూ పదేళ్ల క్రితం ప్రచురితమైన ఓ కథనాన్ని ఉటంకించాడు.


ప్రముఖ బౌద్ధ గురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాను కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్‌తో పోల్చుతూ సదరు పాకిస్తాన్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
 
‘‘యూఎన్ఎస్సీలో మసూద్ అజార్‌‌పై వచ్చిన ప్రతిపాదనను చైనా ఎందుకు అడ్డుకుంటోందో తెలుసుకోవడం చాలా సులభం. దశాబ్దాలుగా చైనా శత్రువుకు భారత్ ఆశ్రయం కల్పిస్తోంది... అతని పేరు దలైలామా..’’ అని హమీద్ ట్వీట్ చేశాడు. 1959లో చైనాపై టిబెట్ తిరుగుబాటు చేసిన తర్వాత, దలైలామా తన దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందారు. అప్పట్నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు. ప్రముఖ బౌద్ధ మతగురువైన దలైలామాను...ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు గౌరవించి సత్కరిస్తూ, 1989లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందజేసాయి.
 
అయితే... నోబుల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాపై పాకిస్తాన్ జర్నలిస్టు హమీద్ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్లో పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘శాంతి బహుమతి గ్రహీత దలైలామాను ఉగ్రవాదితో పోలుస్తావా? పాకిస్తాన్ భిక్షమెత్తుకునే పరిస్థితిలో ఎందుకు ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. చైనా, సౌదీ దగ్గరికి పోయి మళ్లీ అడుక్కోండి..’’ అని ఓ నెటిజన్ ఘాటుగానే విమర్శించాడు.