శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

హజ్ యాత్రలో విషాదం.. ఈ యేడాదిలో 1301 మంది మృత్యువాత!!

hajj
ముస్లిం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో అనేక విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ యేడాది ఇప్పటివరకు ఏకంగా 1301 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సౌదీ అధికారులు ప్రకటించారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే ఈ మరణాలకు కారణమమని వెల్లడించాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని తెలిపాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగమండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ అల్‌-జలజెల్‌ వెల్లడించారు.
 
95 మంది యాత్రికులకు చికిత్స అందుతున్నట్లు అధికారిక టీవీ ఛానల్‌ ఎఖ్‌బరియా టీవీతో మాట్లాడుతూ ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ తెలిపారు. వీరిలో కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ యేడాది హజ్‌ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
 
మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారని ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్‌ యాత్రకు వెళ్లినవారేనని తెలిపాయి. వీరిని తీసుకెళ్లిన 16 ట్రావెల్‌ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఈజిప్టు నుంచి ఈ ఏడాది మొత్తం 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్‌కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.