ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (12:34 IST)

పాకిస్థాన్ కోర్టులో 'పరువు' పోయింది... అడ్డూఅదుపులేని పరువు హత్యలు

gunshot
పాకిస్థాన్ దేశంలో పరువు హత్యలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాజాగా మరో హత్య జరిగింది. ఇది సాక్షాత్ కోర్టు హాలులోనే జరిగింది. తనను ఎదిరించి వైద్యుడిని వివాహం చేసుకున్న కుమార్తెను కన్నతండ్రి కోర్టులోనే తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పాకిస్థాన్ ప్రధాన ఓడరేవు నగరమైన కరాచీలో జరిగింది. 
 
నగరంలోని పిరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వైద్యుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని ఆ యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆ యువతి కరాచీ సిటీ కోర్టుకు వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని తండ్రి కుమార్తెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
తాజాగా ఘటనలో యువతి తన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఇదే తండ్రి ఆగ్రహానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశంలో జరుగుతున్న పరువు హత్యల వెనుక తండ్రి, భర్త, సోదరుడు లేదంటే కుటుంబ సభ్యుడో ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. 
 
కాగా, పరువు హత్యల పేరుతో పాకిస్థాన్‌లో అనేక మంది దారుణ హత్యలకు గురవుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారని పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థ తెలిపింది. గత దశాబ్దకాలంలో ఏడాదికి సగటున 650 మంది పరువు హత్యలు జరిగినట్టు తెలిపింది.