శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (18:00 IST)

వారం పాటు లీవు పెట్టేసింది.. స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపింది.. చివరికి వేళ్లు వంగిపోయాయ్!

సోషల్ మీడియా పుణ్యంతో స్మార్ట్ ఫోన్ల వాడకం అమాంతం పెరిగిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవని వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇంకా సెల్‌ఫోన్ దిండు పక్కన పెట్టుకుని నిద్రపోయేందుకు మనసు రాక.. అలాగే రాత్రిళ్లు గడిపేవారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. తాజాగా అలా 24 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌లో గడిపిన ఓ యువతికి తగిన శాస్తి జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. చైనా, హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారిపోయింది. తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టి మరీ సమయాన్నంతా ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంది. కేవలం నిద్రపోయే సమయంలో మాత్రమే ఫోన్‌ను వదిలిపెట్టేది. ఇలాగే రోజు చేయడంతో చేతులు నొప్పి పెట్టి.. చివరికి ఆమె వేళ్లు వంగిపోయి బిగుసుకుపోయాయి.
 
స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా పట్టుకుని ఉపయోగించేదో.. అదే పొజిషన్‌లో ఆమె వేళ్లు కూడా ఉండిపోయాయి. ఆమె చేతులు తిరిగి మామూలు స్థితికి రాలేదంటే.. ఆమె ఏమేరకు స్మార్ట్ ఫోన్ వినియోగించుకుందో తెలుసుకోవచ్చు. అయితే వైద్యుల వద్దకు వెళ్లడంతో.. ఆమె చేతి వేళ్లను వైద్యులు తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు. కానీ ఆమె స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.