1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (18:36 IST)

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్రీస్ పురస్కారం

greece
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్రీస్ పురస్కారం వచ్చింది. మరోవైపు, గ్రీస్‌ అధ్యక్షురాలు కాథెరినా ఎన్‌ సకెల్లారోపౌలౌతో మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గ్రీస్‌ 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ హనర్‌' పురస్కారం ప్రదానం చేశారు. ఇది గ్రీస్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం. ఈ విషయంలో గ్రీస్ ప్రజలకు, అధ్యక్షురాలికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. గ్రీస్ ప్రజలకు భారత్ పట్ల ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.
 
ప్రస్తుతం గ్రీస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శుక్రవారం ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
 
భారత్‌ - గ్రీస్‌ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం అంగీకరించినట్లు వెల్లడించారు. 'ఇరుదేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనా దృష్టి సారించాం. భారత్‌, గ్రీస్‌ల మధ్య నైపుణ్య వలసలను సులభతరం చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాం' అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 
 
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. దౌత్యం, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు మద్దతు ఇస్తాయన్నారు. కొన్నేళ్లుగా భారత్‌తో తమ సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని.. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, పర్యాటక రంగాల్లో విస్తృత సహకారానికి అవకాశం ఉందని గ్రీస్‌ ప్రధాని మిత్సోటాకిస్ అన్నారు.