గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (12:55 IST)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతికి బ్రెయిన్ డెడ్

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయ్యారు. యూఎస్‌లోని మిచిగాన్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న చరితా రెడ్డి (26) కారు ప్రమాదానికి గురయ్యారు. చరితా రెడ్డి తన టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి మరో కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి కోమాలోకి వెళ్లిపోయారు.
 
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక ముస్కేగాన్ ఆస్పత్రికి తరలించారు. చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. 
 
మిచిగాన్‌లోని లాన్సింగ్‌లో ఆమె నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం తాగి కారు నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. చరితా రెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలియడంతో హైదరాబాద్‌లో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.