మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (10:50 IST)

పతనావస్థకు పాకిస్థాన్ ఆర్థిక రంగం : పాక్ ప్రధాని ఇమ్రాన్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తమ దేశ ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేశారు. దేశాన్ని నడిపేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ప్రకటించి బాంబు పేల్చారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేమని తెగేసి చెప్పారు. 
 
దేశ ఆర్థిక రంగం పతనావస్థకు చేరుకోవడానికి విదేశీ అప్పులు పెరిగిపోవడం, దేశీయంగా పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయన్నారు. దీంతో దేశ రక్షణ రంగానికి కూడా తగినన్ని నిధులను కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరోమారు విదేశీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 
 
ముఖ్యంగా, గత నాలుగు నెలల్లో ప్రభుత్వం ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేసిందని గుర్తుచేశారు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రజలు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలని ఇస్లామాబాద్ నగరంలో బ్యూరో ఆఫ్ రెవెన్యూ విభాగంలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు.