పాక్ ప్రధాని శ్రీలంక పర్యటన.. గగనతలాన్ని ఉపయోగించుకోవచ్చు.. భారత్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు తన గగనతలాన్ని ఉపయోగించడానికి భారత్ అనుమతించింది. వచ్చేవారం మంగళవారం ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారుల బృందంతో కలిసి రెండు రోజుల పర్యటనకు శ్రీలంకకు వెళ్లనున్నారు. ఇందుకు భారత్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది.
గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ వీవీఐపీ విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి కోరగా.. తిరస్కరించింది. జమ్మూ-కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నాయని, అందుకే తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.
బాలాకోట్ దాడుల తర్వాత పాక్ గగనతలాన్ని కొంతకాలం తర్వాత మళ్లీ తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌కు చెందిన విమానాలను రానీయకుండా పాక్ తన గగనతలాన్ని మరోసారి మూసివేసింది.
శ్రీలంక పర్యటనలో ఇమ్రాన్.. ఆ దేశ ప్రధాని మహీంద రాజపక్సేతో సమావేశవుతారని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సాంకేతిక, రక్షణ, పర్యాటరంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారని, ప్రధాని రాజపక్సే ఆహ్వానం మేరకు ఇమ్రాన్ శ్రీలంక పర్యటనకు వెళ్తున్నారని విదేశాంగ కార్యాలయం పేర్కొంది.