1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (12:06 IST)

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

kenya roits
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఆ దేశ పాలకులు పన్నులను పెంచారు. పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. మంగళవారం కెన్యా పార్లమెంట్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఆందోళనకారులు చనిపోయారు. డజన్ల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పార్లమెంటు భవనంలోని కొన్ని విభాగాలు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్‌లో పన్నుల పెంపు బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో కెన్యాలో ఆందోళనలకు మరింత అవకాశం ఉంది. ప్రస్తుతం కెన్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
ఈ పరిస్థితులను బేరీజు వేసిన కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుంటే బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. 'ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుంటే బయటకు రావొద్దు. పరిస్థితులు చక్కబడే వరకు నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకండి' అని కెన్యాలోని భారత కాన్సులేట్ ట్విట్టర్ వేదికగా అడ్వైజరీ ఇచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక కెన్యాలో నివసిస్తున్న భారత పౌరులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. ఇక అప్డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని సూచన చేసింది.