"మిషన్ శక్తి"గా భారత్.. వార్నింగ్ ఇచ్చిన అమెరికా
అంతరిక్ష సైనికుడుగా భారత్ అవతరించింది. అంతరిక్షంలోని శత్రుదేశ ఉపగ్రహాలను కూల్చివేసే 'మిషన్ శక్తి' ఆపరేషన్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించింది. దీంతో భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైన్‌ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా చేసింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఇప్పుడు భారత్ కూడా సాధించింది. శత్రుదేశాల శాటిలైట్ల ఆటకట్టించే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా భారత రహస్యాల కోసం శత్రు దేశాలు నిఘా శాటిలైట్లను పంపడం తగ్గుతుంది.
భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్‌ను విజయవంతంగా కూల్చేయడం ద్వారా 'అంతరిక్ష యుద్ధం' చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా భారత్ నిలిచింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. భారత్‌కు హెచ్చరికలు జారీచేసింది. యాంటీ శాటిలైట్ వెపన్స్‌తో అంతరిక్షంలో గందరగోళం సృష్టించొద్దని అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ హెచ్చరించారు.
ధ్వంసమైన శాటిలైట్ల శకలాల విషయమై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనమంతా అంతరిక్షంలో భాగంగానే ఉన్నామన్న ఆయన దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ కార్యకలాపాలను అంతరిక్షంలో సాగించుకునే అవకాశాలు ఉండాలని చెప్పారు.
మిషన్ శక్తి ప్రయోగం తర్వాత అంతరిక్షంలో మిగిలిన శాటిలైట్ శకలాల గురించి మాత్రం అమెరికా ప్రస్తావించలేదు. ఈ పరీక్షను తాము అధ్యయనం చేస్తున్నామని, ఎవరికీ అంతరిక్షాన్ని అస్థిరపరిచే హక్కు లేదని చెప్పారు. యాంటీ శాటిలైట్ పరీక్షలతో శకలాల సమస్యను పెంచొద్దని కోరారు. దీనిపై స్పందించిన భారత్.. శాటిలైట్ శకలాల సమస్య ఎంతమాత్రమూ తలెత్తబోదని స్పష్టంచేసింది.