కరోనా సోకుతుందనీ... 3 నెలలుగా ఎయిర్‌పోర్టులోనే ఆశ్రయం...
ప్రపంచ ప్రజలను కరోనా వైరస్ వణికించింది. ఈ వైరస్ దెబ్బకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వణికిపోయాయి. ప్రజలు కూడా భయపడిపోయారు. ఈ వైరస్ సోకుతుందన్న భయంతో బయటకు కూడా రాలేదు. ఈ క్రమంలో ఓ ప్రవాస భారతీయుడు ఏకంగా మూడు నెలల పాటు విమానాశ్రయంలో రహస్యంగా తలదాచుకున్నాడు. ఈ సంఘటన చికాగోలని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.
'చికాగో ట్రిబ్యూన్' పత్రిక వెల్లడించిన వివరాల మేరకు... 36 సంవత్సరాల ఆదిత్య సింగ్ అనే వ్యక్తి, విమానంలో ప్రయాణించేందుకు ధైర్యం చేయలేక, గత సంవత్సరం అక్టోబర్ 19 నుంచి విమానాశ్రయంలోని సెక్యూర్ ఏరియాలో తలదాచుకున్నాడు. అతన్ని ఈ మూడు నెలల కాలంలో ఎవరూ గుర్తించలేదు.
అక్టోబర్ 19న అతను లాస్ ఏంజిల్స్ నుంచి చికాగో విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడని వెల్లడించిన పోలీసులు, అతనిపై నేరపూరిత కుట్ర, అనుమతిలేని ప్రదేశంలో తలదాచుకోవడం, దొంగతనం ఆరోపణలను మోపుతూ కేసును నమోదు చేశారు. ఓ సెక్యూరిటీ ఉద్యోగి బ్యాడ్జిని దొంగిలించిన ఆదిత్య, దాన్ని తగిలించుకుని అక్కడే గడిపాడు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి ఒకరు అతన్ని ప్రశ్నించడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. కరోనా కారణంగానే ఇంటికి వెళ్లేందుకు భయపడిన ఆదిత్య ఎయిర్ పోర్టులోనే ఉన్నాడని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ క్యాథలీన్ హెగర్టీ వ్యాఖ్యానించారు.
ఈ మూడు నెలలూ విమానాలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు వదిలి వెళుతున్న ఆహారంతోనే కాలం గడిపాడని పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసును విచారిస్తున్న కౌంటీ న్యాయమూర్తి సుసానా ఓర్టిజ్, ఆదిత్య విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఉద్యోగి కాని వ్యక్తి అంతకాలం పూర్తి భద్రతా వలయంలో ఉండే ప్రాంతంలో ఉన్నాడంటే, అక్కడి సిబ్బంది తప్పు కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదిత్యపై గతంలో ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, ఆతిథ్య రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి, ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడని కూడా గుర్తించి, అతని పని హింసాత్మక చర్య కాదని కోర్టు అభిప్రాయపడింది. అతనికి రూ.1000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేస్తూ, మరోసారి విమానాశ్రయంలోకి రారాదని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను జనవరి 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు.