నేపాల్‌లో ఘర్షణలు - హోటల్‌కు నిప్పు - భారత మహిళ మృతి
నేపాల్ అంతర్గత ఘర్షణలతో అట్టుకుడికిపోతోంది. కొందరు ఆందోళనకారులు హోటల్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారత మహిళ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు తారా స్థాయికి చేరాయి. ఫలితంగా అంతర్గత ఘర్షణలకు దారితీశాయి. దీంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ రాజధాని ఖాట్మండులోని పార్లమెంట్, అధ్యక్ష, ప్రధాని నివాసాల పైనా దాడులు చేశారు. ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసనలకు పాల్పడుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన దంపతులు రాజేష్ దేవి గోలా (57), రాంవీర్ సింగ్ గోలా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడం కోసం సెప్టెంబరు 7వ తేదీన అక్కడికి వెళ్లారు. ఖాట్మండులోని హోటల్ హయత్ రీజెన్సీ హోటల్‌లో బస చేశారు. అనంతరం నేపాల్‌లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
సెప్టెంబరు 9వ తేదీ రాత్రి సమయంలో నిరసనకారులు వీరు ఉంటున్న హోటల్‌ను చుట్టుముట్టి నిప్పంటించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక బృందాలు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు చేయి దాటడంతో.. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు మరికొందరు వ్యక్తులతో పాటు భారతీయ జంట నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
రాంవీర్‌ను సహాయక శిబిరానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందలేదని ఉత్తరప్రదేశ్‌లోని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ తల్లి మృతి గురించి కూడా అధికారులు సమాచారం అందించలేదని వాపోయారు.