భారత్ మా మిత్రదేశం... దూరం చేసుకోం : ఇరాన్
ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న భారత్‌ను తప్పించినట్టు వచ్చిన వార్తలపై ఇరాన్ స్పందించింది. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదనీ, పూర్తిగా అవాస్తమని పేర్కొంది. భారత్ తమ మిత్రదేశమని, భారత్‌ను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు.
'జహేదాన్ - చాబహార్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. అవి పూర్తిగా అవాస్తవం. చాబహార్ ప్రాంతంలో ఇండియాతో రెండు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
ఒకటి పోర్టుల్లో యంత్రాలు, ఇతర పరికరాల సరఫరా నిమిత్తం, రెండోది 150 మిలియన్ డాలర్ల ప్రాజక్టు' అని ఆయన వ్యాఖ్యానించారు. చాబహార్ పోర్టులో ఇండియా పెట్టుబడులు ఎన్నో ఉన్నాయని, వాటిల్లో రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా ఉందని అన్నారు.