బాగ్దాద్ సదర్ మార్కెట్‌లో బాంబు పేలుడు : 35 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ సదర్ నగరంలోని మార్కెట్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మార్కెట్‌లో బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగకు పెద్ద ఎత్తున జనం మార్కెట్లకు రాగా.. అదును చూసి ఉగ్రవాదులు బాంబు పేల్చారు.
అప్పటివరకు కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎటు చూసినా రక్తపు మరకలు.. బాధితుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడ్డారని, ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి కొన్ని దుకాణాలు కాలిబూడిదయ్యాయి. స్థానికంగా తయారు చేసిన ఐఈడీతోనే ఉగ్రవాద దాడి జరిగిందని ఇరాక్ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి ఘటనపై ఇరాక్ అధ్యక్షుడు బర్హామ్ సలీమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఏ ఒక్క ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు.