నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్ - దిశ మారిన గ్రహశకలం
అనంత విశ్వం నుంచి అపుడపుడూ గ్రహ శకలాలు భూమిపైకి వస్తుంటాయి. ఇవి భూమిని ఢీకొంటే పెను ప్రమాదమే ఏర్పడే అవకాశం ఉంది. అయితే, ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పును నివారించగల సామర్థ్యాలను సముపార్జించుకోవడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా 'డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్)' పేరుతో ఓ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతమైంది.
గత నెల 26న డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా మంగళవారం ప్రకటించింది.
గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.