శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:34 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి దారిచ్చే ప్రసక్తే లేదు : తేల్చేసిన పాకిస్థాన్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సివుంది. అయితే, మోడీ ప్రయాణించే విమానానికి తమ గగనతలంపై దారిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 
 
నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కోసం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతించాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనిపై పాక్ స్పందించింది. తమ దేశ గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీలులేదని తేల్చి చెప్పింది. 
 
ఈ సమాచారాన్ని భారత హై కమిషన్‌కు చేరవేసింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. దీంతో మోడీ విమానం ఇతర దేశాల గగనతలం మీదుగా అమెరికాకు వెళ్లనుంది.
 
కాగా, జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. ఈ చర్యను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
అంతకుముందు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడికి దిగడంతో తన గగనతలాన్ని మూసేసిన పాక్.. తాజాగా భారత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.