నో ఫియర్ ఫ్రమ్ కరోనా.. ఈఫిల్ టవర్ వద్ద సందడే సందడి!
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో చేరిపోతున్నాయి. అలాగే, మరణిస్తున్న వారు కూడ వేలల్లో ఉన్నారు. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా అనేక దేశాలు లాక్డౌన్ అమలు చేశాయి. ఫలితంగా పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయాయి.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఉన్న ప్రసిద్ధ ఈఫిల్ టవర్ తిరిగి తెరుచుకుంది. మూడు నెలల లాక్డౌన్ తర్వాత ఈఫిల్ టవర్‌కు మళ్లీ సందర్శకుల తాకిడి మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఈఫిల్ టవర్‌ను 104 రోజుల పాటు మూసివేయడం ఇదే తొలిసారి.
పారిస్‌లో ఉన్న టవర్‌ను చూసేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు అక్కడకు వెళ్తుంటారు. 1889లో పూర్తి అయిన ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని వీక్షించేందుకు ప్రతి ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
కోవిడ్ నేపథ్యంలో సందర్శకుల కోసం ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. అయితే ఇక నుంచి కొన్నాళ్ల పాటు పర్యాటకుల సంఖ్యను తగ్గించనున్నారు. 11 ఏళ్లు దాటిన వారికి ఫేస్‌మాస్క్ తప్పనిసరి. టవర్‌లో రెండవ అంతస్తును కూడా మూసివేశారు.