శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (09:05 IST)

14 నుంచి అయ్యప్ప స్వామి దర్శనం... కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఇవ్వాలట...

దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రంలో కూడా భక్తులకు త్వరలోనే దర్శనభాగ్యం కల్పించనున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఆలయంలో భక్తుల దర్శనం గత రెండు మూడు నెలలుగా మూసివేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ నెల 14న ఆలయాన్ని తెరిచి నెలవారీ పూజలు నిర్వహిస్తామని, 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతిలో నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
 
అదేసమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అది కూడా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించుకున్నదై ఉండాలని స్పష్టం చేశారు. 
 
అదేవిధంగా భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. వీరికి పంప, సన్నిధానం వద్ద స్క్రీనింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. 
 
కాగా, కరోనా నేపథ్యంలో ఈ తేదీలను వాయిదా వేయాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు బోర్డుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే, అలాంటి లేఖ ఏదీ తమకు అందలేదని, అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ తేదీలను నిర్ణయించినట్టు బోర్డు అధ్యక్షుడు వాసు తెలిపారు. మరోవైపు, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆలయంలో భక్తులకు ప్రవేశం కల్పించిన విషయం తెల్సిందే.