లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
ప్రపంచ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం జరుగుతున్న వేళ.. లైంగిక వేధింపులకు, దాడుల నిరోధానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఉన్నత ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్షపాతంగా వ్యవహరించారని గతవారం గూగుల్ ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మంది వాకౌట్ చేశారు.
దీనిపై పిచాయ్ స్పందిస్తూ.. తమ సంస్థ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. గతంలో సరిగ్గా వ్యవహరించనందుకు ఉద్యోగులను క్షమాపణ కోరారు. వ్యవస్థలో మార్పులను కచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. అప్పట్లో అనుసరించిన విధానాలను మార్చేస్తామని.. ఉద్యోగుల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పని ప్రదేశంలో మర్యాదకర వాతావరణం ఉండేలా చూస్తామని సుందర్ పిచాయ్ లేఖలో హామీ ఇచ్చారు.
గడిచిన రెండేళ్లలో లైంగిక వేధింపుల ఆరోపణలో భాగంగా 48మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.